Nagoba Temple | Nagadevatha Ammavaru | Keslapur Village, Muthkur, Adilabad | Telangana Tourism
నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా, ముట్నూరు గ్రామానికి సమీపంలో కిస్లాపూరు గ్రామంలో ఉంది. అంటే, ముట్నూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో అన్నమాట.
కిస్లాపూరు గిరిజనుల ఊరు. వారి ఆరాధ్య దేవత నాగోబా. నాగోబా అంటే సర్పదేవత.. నాగుపామును చాలామంది ఆరాధిస్తారు. నాగ పంచమి, నాగుల చవితి లాంటి పర్వదినాల్లో నాగుపాముకు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తాం. అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శివాలయంలో నాగ దేవత శిలాఫలాకాలు, కొన్ని పాము పుట్టలు ఉండటం తెలిసిందే.
ఆదిమానవులు పాములు విషాన్ని కక్కుతాయి కనుక, వాటికి భయపడేవారు. ఆ భయంలోంచే భక్తి భావన పుట్టుకొచ్చింది. అందుకే ఇప్పటికీ పాములను పూజిస్తున్నారు. ఇక గిరిజనుల కయితే నాగదేవత మరీ ప్రియమైన దేవత. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకూ అడవులు పట్టుకు తిరగాలి కనుక వారికి పాములతో సాహచర్యం తప్పదు. అందుకే పిల్లలకు, పెద్దలకు విష సర్పాల నుండి ఎలాంటి హానీ జరక్కూడదని, తాము సదా సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ నాగ దేవతను పూజిస్తారు.
కిస్లాపూరు గిరిజనులు నాగోబాకు ఒక మందిరం కట్టించారు. ఇది పెద్దదేమీ కాదు, చిన్న దేవాలయమే. ఈ మందిరంలో ప్రతిష్టించిన నాగోబాను ఆరాధిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరింత వేడుకగా ఉత్సవాలు జరుపుతారు. నాగపంచమి, నాగులచవితి పండుగ రోజుల్లో నాగోబా దేవాలయంలో మహా ఉత్సవమే చేస్తారు. అలాంటి తరుణాల్లో కిల్సాపూరు వాసులే కాకుండా, మొత్తం ఆదిలాబాద్ జిల్లాలోని వేలాదిమంది గిరిజనులు తరలివస్తారు.
నాగోబా దేవాలయ ప్రాంతాన్ని వేదికగా చేసుకుని ఆ పరిసర ప్రాంతాల గిరిజనులు తమ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడతారు. నృత్యాలు చేస్తారు. ఏడాది పొడుగునా కాయకష్టం చేసి బ్రతికే ఈ గిరిజనులు ఇలాంటి సందర్భాల్లో తమ ఇష్ట దైవం అయిన నాగోబా సన్నిధిలో కష్టాలు, కల్లోలాలు మర్చిపోయి సంతోషంగా గడుపుతారు.
ఈ నాగోబా ఆలయానికి కేవలం గిరిజనులే కాదు, ఇతరులూ వస్తారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను చూసి నవ నాగరికులు సైతం ఆనందిస్తారు.
No comments